Ad Code

ధ్యానధ్యాతృధ్యేయరూపా (అష్టాక్షరి) - Ashtakshari

ధ్యానధ్యాతృధ్యేయరూపా (అష్టాక్షరి)



ఇది ఎనిమిది అక్షరములు గల్గిన మంత్రము. పూజా సమయంలో “ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయై నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

ధ్యాన = ధ్యాన క్రియ; ధ్యాతృ = ధ్యానం చేసే వాడు; ధ్యేయ = ధ్యానము చేయబడే వస్తువు. ఈ మూడింటి యొక్క రూపా = స్వరూపమైనది శ్రీదేవి.

“ధ్యానం నిర్విషయం మనః” శబ్దాది విషయరహితమైన మానసిక స్థితి ధ్యానము అనబడును. అనగా ఇంద్రియాలు బాహ్యముఖతను వీడి అంతర్ముఖము అగుట ధ్యానం అగును.

ధ్యాతృ - ధ్యాన - ధ్యేయములు,
జ్ఞాతృ- జ్ఞాన- జ్జీయములు,
ద్రష్ట - దృష్టి -దృశ్యములు,

ఉపాసక - ఉపాసనా - ఉపాస్యములు ఇత్యాదులు త్రిపుటి అనబడుతాయి. భ్రమరకీట న్యాయమున మూడునూ తీవ్ర ఐక్యమును పొందుతాయి. అనగా ధ్యానంలో ధ్యేయ స్థితియు జ్ఞానంలో జేయాకారతయు ఉపాసనలో ఉపాస్య స్థితియు ఏర్పడుతాయి. దీనినే త్రిపుటిలయము అందురు. ఈ స్థితిలో ధ్యానమును, ధ్యేయమును - అంతయును అమ్మయే అని భావము.
ఈ చరాచర ప్రపంచము అమ్మ నుండియే వచ్చింది. అమ్మ కంటే భిన్నం ఏదియును లేదు. బంగారంతో నిర్మితాలైన ఆభరణాలు అన్నియును బంగారమే. నామరూపములు
కల్పితాలు మాత్రమే. సహస్రారచక్రానికి కుండలినీ శక్తి చేరినచో ధ్యాన, ధాతృ, ధ్యేయ లయము అనేది సాధకులకు అనుభవసిద్ధము.

ధ్యానమును సగుణము, నిర్గుణము అని రెండు విధాలుగా విభజిస్తారు. త్రిపుటిలయము అనేది నిర్గుణ ధ్యానానికే వర్తిస్తుంది అని అనుభవజ్ఞులు అందురు. కొందరు సగుణ ధ్యానంనందునూ ఉపాస్య దేవతా రూపతగల్గును అందురు.

తంత్రశాస్త్రమును అనుసరించి, వేదాంత శాస్త్రాన్ని అనుసరించి నిర్గుణోపాసనయే బోధితము అగుచున్నది.

ఈ మంత్రముతో దేవిని ఉపాసించేవారికి ఆ తల్లి కరుణచే ధ్యేయా కారతయు, సర్వదుఃఖ నివృత్తియు త్వరలో ప్రాప్తిస్తాయి.


సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.







Post a Comment

0 Comments